CP Sajjanar: రోడ్డు భద్రతపై తరచూ అవగాహన కల్పించే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. బైక్పై ప్రయాణిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమవడం ఎంత ప్రమాదకరమో వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.. ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుందని, కానీ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బైక్పై ప్రయాణిస్తూ పని చేయడం వంటి చర్యలు తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయని సజ్జనార్ హెచ్చరించారు. అతిగా తొందరపడటం, ఏకాగ్రత కోల్పోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
రోడ్డుపై వాహనం నడిపే సమయంలో ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని ఆయన గుర్తుచేశారు. అలాంటి అజాగ్రత్త వల్ల కేవలం ప్రయాణించే వ్యక్తికే కాకుండా, రోడ్డుపై వెళ్తున్న ఇతర అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధి కోసం, జీవనోపాధి కోసం చేసే పని మన జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టే విధంగా ఉండకూడదని సజ్జనార్ సూచించారు.
రహదారులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకుని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోగలరని సజ్జనార్ పేర్కొన్నారు.








