ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం BMW కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వ్యయాలు, చైనా మార్కెట్లో అమ్మకాలు పడిపోవడం, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో లాభాలు తగ్గడంతో జర్మనీలో వేలాది మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించింది.. 2027 చివరి నాటికి సుమారు 8,000 ఉద్యోగాలను తగ్గించే లక్ష్యంతో ఈ ప్రణాళికను అమలు చేస్తోంది. జర్మనీలో BMWకు 85 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా, వారిలో దాదాపు 40 వేల మంది ఆఫీస్ లేదా డెస్క్ ఆధారిత ఉద్యోగులకు అక్టోబర్ నుంచి VRS ఆఫర్లు ఇవ్వనుంది. అయితే ఉత్పత్తి కేంద్రాలు, ప్లాంట్లలో నేరుగా పనిచేసే కార్మికులను ఈ ప్రక్రియ నుంచి మినహాయించారు.
ప్రపంచవ్యాప్తంగా BMWలో సుమారు 1.54 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణపై కంపెనీ యాజమాన్యం, వర్క్స్ కౌన్సిల్ మధ్య దాదాపు ఆరు వారాల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తగ్గుతున్న లాభాలు, అమెరికా విధించిన దిగుమతి సుంకాలు, ముఖ్యంగా చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ జర్మన్ ఆటోమొబైల్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు BMW ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే Volkswagen భారీ స్థాయిలో ఉద్యోగాల కోతపై ఆలోచిస్తుండగా, Mercedes-Benz కూడా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేస్తోంది.
పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలను సమాంతరంగా విక్రయిస్తున్నప్పటికీ, BMWకి అత్యంత కీలకమైన చైనా మార్కెట్లో విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనాలో BMW కార్ల డెలివరీలు 30 శాతం వరకు తగ్గాయి. దీంతో ఇటీవలే కంపెనీ లాభాలపై హెచ్చరిక జారీ చేసింది. వ్యాపారాన్ని తిరిగి లాభాల బాట పట్టించేందుకు ఖర్చుల నియంత్రణలో భాగంగా భారీ స్థాయిలో VRS, ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు కంపెనీ సంకేతాలు ఇచ్చింది.
ALSO READ: Indian Railways | Tatkal Ticket Booking కొత్త రూల్స్.. ఇక గంటల తరబడి వెయిటింగ్‌కు గుడ్‌బై!








