Abhinandan Varthaman: దేశ రక్షణ కోసం ఆకాశంలో శత్రువులతో పోరాడిన ఓ యోధుడు.. ఇక సామాన్య ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సిద్ధమయ్యారు. వీర చక్ర పురస్కార గ్రహీత, భారత వైమానిక దళ మాజీ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన కెరీర్‌లో మరో కీలక మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు IAFలో సేవలందించిన ఆయన తాజాగా కమర్షియల్ ఏవియేషన్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. గోవా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో అభినందన్ పైలట్‌గా చేరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టులో ఆయన సంస్థలో చేరినట్లు సమాచారం. అయితే ఆయనకు అప్పగించిన బాధ్యతలపై FLY91 అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం కారణంగా వ్యాఖ్యానించలేమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2019లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో అభినందన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. బాలాకోట్ దాడుల అనంతరం జరిగిన వైమానిక పోరులో పాకిస్థాన్ ఎఫ్-16ను తన మిగ్-21 బైసన్‌తో కూల్చివేసినట్లు భారత్ ప్రకటించింది. ఆ సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి సైన్యానికి చిక్కారు. సుమారు మూడు రోజుల నిర్బంధం తర్వాత ఆయన భారత్‌కు తిరిగి వచ్చారు.
ఆయన ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకు 2021లో కేంద్ర ప్రభుత్వం ‘వీర చక్ర’(Veer Chakra Awardee)తో గౌరవించింది. అభినందన్ తండ్రి ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్ కూడా భారత వాయుసేనలో సేవలందించారు. 2024 మార్చిలో విమాన సేవలు ప్రారంభించిన FLY91 ప్రస్తుతం ATR 72-600 విమానాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గోవాతో పాటు హైదరాబాద్ నుంచి కూడా సేవలు అందిస్తోంది. యుద్ధ విమానం నడిపిన అభినందన్ ఇప్పుడు కమర్షియల్ పైలట్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించడం ఆయన కెరీర్‌లో ఆసక్తికరమైన అధ్యాయంగా మారింది.
ALSO READ: Bollaram detonators | బొల్లారంలో కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 డిటోనేటర్లు
