Baba Ramdev: ప్రపంచ యోగా దినోత్సవాన్ని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండవల్లి గుహల పరిసర ప్రాంతంలో ‘యోగాంధ్ర’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది. బాబా రాందేవ్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో పాల్గొని యోగాసనాల ప్రదర్శనలను పరిశీలించారు.
ఈ సందర్భంగా బాబా రాందేవ్, సీఎం చంద్రబాబుకు వివిధ యోగా ఆసనాలు, శ్వాస సంబంధిత ప్రక్రియలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధి దృష్టి, స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు పనిచేస్తే 2047 నాటికి అభివృద్ధి లక్ష్యాలు ముందుగానే సాధ్యమవుతాయని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు.
అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా యోగా సంస్కృతికి కేంద్రంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బాబా రాందేవ్ యోగా సాధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. యువతలో యోగా పట్ల ఆసక్తి పెరగడానికి ఆయన సేవలు కీలకమని చెప్పారు. ప్రస్తుత సమాజంలో ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆధ్యాత్మికతతో కూడిన ఆరోగ్యకర జీవనశైలి అవసరమని ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని సీఎం గుర్తుచేశారు.
రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో హరిత విస్తీర్ణాన్ని 50 శాతం వరకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు.
ALSO READ: Uddhav Thackeray | పదవి వదిలేందుకు సిద్ధం.. ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు








