LIVE
Saturday, November 21, 2026
LIVE
LIVE

VS Babu Funeral | వీఎస్ బాబు అంతిమయాత్రలో విజయ్ ఎమోషనల్.. స్వయంగా పాడె మోసిన సీఎం!

by Bajaswamy
3 views
CM Vijay Pays Tribute to VS Babu

VS Babu Funeral: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికైన కోలాత్తూర్ నియోజకవర్గం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూయడంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వీఎస్ బాబు.. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 19న తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ నుంచి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. గురువారం మధ్యాహ్నం 2:24 గంటలకు గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్య సేవల విభాగం డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ వెల్లడించారు.

బాబు మరణవార్త తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం బాబు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెరంబూర్‌లో నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొన్న విజయ్.. ఇతర పార్టీ నేతలతో కలిసి స్వయంగా బాబు పాడె మోశారు. ఈ దృశ్యం అక్కడికి వచ్చిన ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. 2026 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోలాత్తూర్ నుంచి పోటీ చేసిన వీఎస్ బాబు.. డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆయన మృతికి సంతాపంగా టీవీకే పార్టీ ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలను రద్దు చేయడంతో పాటు పార్టీ జెండాలను అవనతం చేయాలని ఆదేశించింది.

పెరంబూర్‌లోని బాబు నివాసం వద్దకు భారీగా ప్రజలు తరలిరావడంతో సమీపంలోని ప్రైవేట్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో పార్థివ దేహాన్ని ఉంచి ప్రజల సందర్శనకు అవకాశం కల్పించారు. అనంతరం అక్కడి నుంచి పల్లవన్ సాలై స్మశానవాటిక వరకు అంతిమయాత్ర కొనసాగింది. విజయ్‌తో పాటు మంత్రులు ఆనంద్, ఆధవ్ అర్జున, తొల్ తిరుమావళవన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్నికల విజయంతో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీఎస్ బాబు మరణం టీవీకే శ్రేణులకు తీరని లోటుగా మిగిలింది. ఆయనకు పలువురు నేతలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More