Aakasamlo Oka Tara: సినిమా విజయం అంటే కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు.. ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడం కూడా! మంచి కథ, సహజమైన నటన, బలమైన భావోద్వేగాలు ఉంటే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో మరోసారి నిరూపించింది దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’. విడుదలైన కొద్ది సమయంలోనే అద్భుతమైన స్పందన అందుకుంటున్న ఈ సినిమా విజయంపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమాకు వస్తున్న స్పందన తమ అంచనాలను మించిపోయిందని తెలిపారు. తాము మంచి సినిమా తీశామనే నమ్మకం ఉన్నప్పటికీ, ప్రేక్షకులు, మీడియా నుంచి ఊహించిన దానికంటే పదిరెట్లు ఎక్కువ ఆదరణ లభించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. సినిమా చూసిన పలువురు భావోద్వేగానికి గురై ఫోన్ చేసి అభినందించారని వెల్లడించారు. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు పవన్ సాదినేని పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించిన అల్లు అరవింద్.. ఆయన తన తదుపరి సినిమాను కూడా తనతోనే చేయబోతున్నట్లు ప్రకటించారు. గున్నం గంగరాజు అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలమని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని, సాత్విక వీరవల్లికి ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పారు. ఆమె తమ నిర్మాణ సంస్థలో మరో రెండు సినిమాలు చేయనున్నట్లు వెల్లడించారు. నాగచైతన్యతో చేయబోయే చిత్రంలోనూ సాత్వికే కథానాయికగా నటించనుందని తెలిపారు. రెండో భాగాన్ని తన నటనతో ముందుకు తీసుకెళ్లిన శ్రుతి హాసన్‌ను కూడా అభినందించారు.
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌తో కలిసి సినిమా నిర్మించడం సంతోషంగా ఉందని, ఆయన గొప్ప నిర్మాత మాత్రమే కాకుండా మంచి స్నేహితుడని కొనియాడారు. దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ, స్పందన తమ టీమ్‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకం ఉంచిన నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు చెప్పారు. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు. మొత్తానికి ‘ఆకాశంలో ఒక తార’ విజయం చిత్ర బృందానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కథాబలంతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
ALSO READ: Nitish Setu | నితీష్ కుమార్ పేరుతో భారీ బ్రిడ్జి.. జాతికి అంకితం చేసిన ప్రధాని
