PM Modi Poverty Remarks: దేశంలో పేదరిక నిర్మూలనపై మరోసారి రాజకీయ చర్చకు తెరలేపారు ప్రధాని నరేంద్ర మోడీ. గత ప్రభుత్వాల పాలనలో పేదరికాన్ని తొలగిస్తామన్న హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. దేశాభివృద్ధి, పేదల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదరిక నిర్మూలనకు సంబంధించి సమర్థవంతమైన విధానాలు అమలు కాలేదని మోడీ ఆరోపించారు. ఒకప్పుడు దేశంలో పేదరికాన్ని శాశ్వత సమస్యగా భావించేవారని, కానీ తమ ప్రభుత్వం దానిని సవాలుగా స్వీకరించి అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తమ పాలనలో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ప్రధాని వెల్లడించారు. భారత్లో పేదరికం తగ్గుతోందంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక ఇవ్వడం తమ ప్రయత్నాలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చిందన్నారు.
ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎర్రకోట నుంచి ప్రతి పేద కుటుంబానికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు. అప్పట్లో కొందరు ఈ ప్రకటనను హేళన చేసినా.. మహిళల గౌరవం, భద్రతకు మరుగుదొడ్లు ఎంత అవసరమో వారికి అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. దేశం నిజమైన అభివృద్ధి సాధించాలంటే పేదల జీవితాల్లో మార్పు రావాలని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అభివృద్ధికి అసలైన అర్థం ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
ALSO READ: Yogi Adityanath Mother | తల్లి పాడె మోస్తూ కన్నీటిపర్యంతమైన యోగి ఆదిత్యనాథ్
