Yogi Adityanath Mother: అధికారం, హోదా, బాధ్యతలు ఎన్ని ఉన్నా.. తల్లి ముందు ప్రతి ఒక్కరూ బిడ్డలే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితంలోనూ అలాంటి హృదయవిదారక ఘట్టం చోటుచేసుకుంది. కన్నతల్లి సావిత్రి దేవిని కోల్పోయిన ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తరాఖండ్‌లో సావిత్రి దేవి అంతిమయాత్ర కన్నీటి పర్యంతంగా సాగింది. తన తల్లి పార్థివ దేహాన్ని స్వయంగా భుజాలపై మోస్తూ యోగి ఆదిత్యనాథ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సందర్భాల్లో ఎంతో గంభీరంగా కనిపించే ఆయన.. తల్లి మరణాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం సావిత్రి దేవి పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం చండీ ఘాట్ శ్మశానవాటికకు తరలించారు. మరోవైపు తల్లి ప్రేమ గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఈ ప్రపంచంలో తల్లి నీడకు మించిన రక్షణ, ఆమె ఆశ్రయానికి మించిన భరోసా మరొకటి ఉండవని పేర్కొన్నారు. తల్లి చూపించే ప్రేమ, ఆప్యాయతలకు ఏదీ సాటిరాదని తెలిపారు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్న యోగి.. తల్లి ముందు ఒక సాధారణ బిడ్డగా కనిపించిన ఈ దృశ్యాలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి.