LIVE
Sunday, November 22, 2026
LIVE
LIVE

Andhra Mandapam | విశాఖ రూపురేఖలు మార్చనున్న ఆంధ్ర మండపం.. ఏడాదిలో పూర్తి చేయాలని ఆదేశం!

by Bajaswamy
2 views

Andhra Mandapam: విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి సదస్సులకు కేంద్రంగా మారే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పర్యాటక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఆకర్షణగా నిలవనున్న ‘ఆంధ్ర మండపం’ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. వచ్చే ఏడాది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సును ఇదే వేదికపై నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విశాఖ నగర పరిధిలోని కాపులుప్పాడ కొండపై సముద్ర మట్టానికి సుమారు 120 మీటర్ల ఎత్తులో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 24 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రాజెక్టు రూపకల్పన కోసం అధికారులు ఏడు రకాల త్రీడీ నమూనాలను సిద్ధం చేశారు. నిర్మాణ సంస్థల ఎంపికకు ఏపీఐఐసీ ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) విధానంలో బిడ్లను ఆహ్వానించింది.

కేవలం సమావేశాల నిర్వహణకే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ సదస్సులు, ఎగ్జిబిషన్లు, ప్రముఖుల బసకు అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో 5 వేల మంది కూర్చునే సామర్థ్యంతో అత్యాధునిక ఆడియో, విజువల్ టెక్నాలజీతో ప్రధాన ఆడిటోరియం నిర్మించనున్నారు. ఇందుకోసం 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కేటాయించారు. మరో 1.50 లక్షల చదరపు అడుగుల్లో భారీ ఎగ్జిబిషన్ హాల్ ఏర్పాటు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల కోసం 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250కి పైగా గదులతో ఫోర్‌స్టార్ హోటల్ నిర్మించనున్నారు. అదనంగా 6.8 ఎకరాల్లో పూలతోటలు, వాటర్ ఫౌంటెన్లు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర అందాలను ఆస్వాదించేలా ప్రత్యేక వ్యూపాయింట్లు కూడా అభివృద్ధి చేయనున్నారు. మొత్తంగా ఆంధ్ర మండపం అందుబాటులోకి వస్తే విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించే అవకాశం ఉంది. పెట్టుబడుల ఆకర్షణతో పాటు పర్యాటకం, ఆతిథ్య రంగాలకు కూడా ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తయితే విశాఖలో భారీ అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు మరో అత్యాధునిక వేదిక అందుబాటులోకి రానుంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More