Yogi Adityanath Mother Funeral: జీవితంలో ఎంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నా.. తల్లి ప్రేమ ముందు ప్రతి ఒక్కరూ చిన్నవారే. అధికారం, హోదా, కీర్తి అన్నీ ఉన్నా అమ్మను కోల్పోయిన బాధను భర్తీ చేయలేవు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితంలోనూ అలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది. తన తల్లి సావిత్రి దేవికి చివరిసారిగా వీడ్కోలు పలుకుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ చండీ ఘాట్ వద్ద తన తల్లి అంత్యక్రియల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గురయ్యారు. తల్లి పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసిన సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లను రుమాలుతో తుడుచుకుంటూ కనిపించిన ఆయనను చూసి అక్కడున్నవారు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. హరిద్వార్ వరకు సాగిన అంతిమయాత్రలో అంత్యక్రియలకు సాధువులు, సన్యాసులు, రాజకీయ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సావిత్రి దేవికి నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, యోగా గురువు బాబా రామ్‌దేవ్, పరమార్థ నికేతన్‌కు చెందిన స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్ తదితరులు ఆమెకు అశ్రునివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం యోగి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన తల్లి శ్రీరాముని పవిత్ర చరణాల చెంత శాంతిని పొందాలని ఆకాంక్షించారు. అలాగే, తల్లి పార్థివ దేహాన్ని మోస్తున్న ఫొటోను (X)లో పంచుకున్నారు. మహాభారతంలోని శ్లోకాన్ని ప్రస్తావిస్తూ తల్లిని మించిన ఆశ్రయం, రక్షణ, ప్రేమ మరొకటి ఉండవని గుర్తుచేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్.. తల్లి ముందు ఓ బిడ్డగానే కనిపించారు. అమ్మను కోల్పోయిన ఆవేదనలో ఆయన పలికించిన కన్నీళ్లు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి.
