Indian Stock Market: ట్రేడింగ్ ప్రారంభ వేళ దేశీయ మార్కెట్లు సానుకూల ధోరణితో ముందుకు సాగినా, ఆ జోరు ఎక్కువసేపు కొనసాగలేదు. ఉదయం లాభాల బాటలో దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ మధ్యాహ్నానికి పూర్తిగా దిశ మార్చుకుని నష్టాల్లోకి జారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, హోర్ముజ్ జలసంధికి సంబంధించిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనకు దారితీయగా, దాని ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 626 పాయింట్లకు పైగా ఎగసి 79,055 స్థాయిని చేరగా, నిఫ్టీ 24,677 వద్ద ట్రేడైంది. అయితే మధ్యాహ్నం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంతో 78,338 వద్ద కొనసాగగా, నిఫ్టీ 103 పాయింట్లు క్షీణించి 24,511 స్థాయికి చేరింది. రోజు గరిష్ఠ స్థాయి నుంచి సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు వెనక్కి తగ్గడం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని స్పష్టం చేసింది. మార్కెట్లో ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా షేర్లు బలహీనపడగా, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సన్ అండ్ టుబ్రో షేర్లు లాభాల్లో నిలిచాయి. మొత్తం 2,140 షేర్లు లాభాల్లో ఉండగా, 1,665 షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
ట్రంప్ హోర్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకునే అవకాశముందని, లేకపోతే ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం పెట్టుబడిదారుల్లో అప్రమత్తత పెంచింది. అదే సమయంలో ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రారంభ లాభాలను చూసిన పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. విశ్లేషకుల ప్రకారం నిఫ్టీకి 24,700–24,772 స్థాయిలు కీలక ప్రతిఘటనగా ఉండగా, 24,500 తక్షణ మద్దతు స్థాయి. ఈ ప్రతిఘటనను అధిగమిస్తే నిఫ్టీ 24,900 దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ALSO READ: CV Anand | తెలంగాణలో ఎమర్జెన్సీకి ఒకే నంబర్.. ఇక అన్ని సేవలకు డయల్ 112








