Red Sea missile attack: ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. యెమెన్ జలాల సమీపంలో ప్రయాణిస్తున్న ఎంఎస్వీ ఫైజ్ నూరే ఒలియా (MSV Faiz Noore Oliya) నౌకపై మంగళవారం క్షిపణి దాడి జరగడంతో అది తీవ్రంగా దెబ్బతిని చివరకు సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన సమయంలో నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉండగా, సమాచారం అందుకున్న యెమెన్ కోస్ట్ గార్డ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. 13 మంది భారతీయ నావికులతో పాటు ఒక యెమెన్ పౌరుడిని సురక్షితంగా రక్షించి సమీప పోర్టుకు తరలించింది. అనంతరం వారికి అవసరమైన వైద్య సేవలు అందించారు.
ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దాడిని ఖండించింది. కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఎలాంటి కారణం లేకుండా వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడం పూర్తిగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు. భారతీయుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన సిబ్బందికి అవసరమైన అన్ని రకాల సహాయం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేయాలని డైరెక్టర్ జనరల్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA) అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.








