Rajasthan: ఆస్పత్రి అంటే రోగులకు భరోసా కల్పించే ప్రదేశం.. కానీ అక్కడే భద్రత ప్రశ్నార్థకంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. పైకప్పు నుంచి ఒక్కసారిగా ప్లాస్టర్ ఊడి పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. రాజస్థాన్‌లోని చురు జిల్లా సుజన్‌గఢ్ మహిళా ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఆస్పత్రి లోపల నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు ప్లాస్టర్ ముక్క ఊడి మహిళ తలపై పడింది.
ఈ ప్రమాదంలో మహిళకు తలకు గాయాలు కావడంతో వెంటనే వైద్యులు చికిత్స అందించారు. గాయం తీవ్రంగా ఉండటంతో తల భాగంలో రెండు కుట్లు వేసినట్లు సమాచారం. ఆమె వెనుకనే వస్తున్న మరో మహిళ అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి భవనం ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేపట్టాలని గతంలోనే పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రమాదం అనంతరం ఆస్పత్రి యంత్రాంగం భవన మరమ్మతుల కోసం ప్రజా పనుల శాఖకు లేఖ రాసింది. రోగుల భద్రత దృష్ట్యా తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని కోరింది. ప్రభుత్వ ఆస్పత్రుల భవనాల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ALSO READ: Thailand Football Match | మైదానంలో 24 ఏళ్ల ఆటగాడి ప్రాణాలు బలి తీసుకున్న పిడుగు








