Actor R Madhavan: సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఏదైనా రాజకీయ అంశంపై స్పందించినప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తుంటుంది. తాజాగా నటుడు ఆర్. మాధవన్ విషయంలోనూ ఇదే జరిగింది. తనపై వస్తున్న రాజకీయ ముద్రలు, సోషల్ మీడియా విమర్శలపై ఆయన తొలిసారి స్పష్టంగా స్పందిస్తూ తన వైఖరిని వెల్లడించారు. తనను ఏదో ఒక రాజకీయ సిద్ధాంతంతో అనుసంధానం చేయడం సరికాదని స్పష్టం చేసిన ఆయన, మంచి పని చేసే ప్రజాప్రతినిధులను ప్రశంసించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాధవన్.. తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి నిర్ణయాలకు మాత్రమే తన మద్దతు ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు, ట్రోల్స్ తన వ్యక్తిగత అభిప్రాయాలను మార్చలేవని స్పష్టం చేశారు. ఇటీవలే విడుదైలైన తన తాజా చిత్రం ‘ధురంధర్’ ను ప్రచార చిత్రంగా కొందరు అభివర్ణించడంపై కూడా మాధవన్ స్పందించారు. ఈ సినిమా దేశ భద్రత, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సాగే నేషనల్ సెక్యూరిటీ డ్రామా మాత్రమేనని వివరించారు.
దేశానికి సంబంధించిన విజయాలు, కీలక అంశాలను సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడంలో తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. కేవలం విమర్శల భయంతో వాస్తవాలను దాచడం తమ ఉద్దేశం కాదని తెలిపారు. కథను కథగా చూడాలని, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని మాధవన్ అభిప్రాయపడ్డారు.








