AP Excise Policy 2026-27: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ 2026-27కు అనుగుణంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ మరో దశకు చేరుకుంది. రెన్యువల్ కాకుండా మిగిలిన షాపులతో పాటు గతంలో కేటాయించకుండా ఉన్న దుకాణాలను కలిపి మొత్తం 807 షాపులకు కొత్తగా లైసెన్సులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం సెప్టెంబర్ 24న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 2026-27 ఎక్సైజ్ పాలసీ కింద మొత్తం 3,736 రిటైల్ మద్యం దుకాణాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ప్రక్రియలో 807 షాపులకు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించారు. వీటిలో 799 షాపులు ఓపెన్ కేటగిరీలో, 8 షాపులు రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
మద్యం షాపుల లైసెన్సుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ 5న లాటరీ ద్వారా అర్హులైన వారికి షాపులను కేటాయించనున్నారు. జిల్లాల వారీగా చూస్తే వైఎస్సార్ కడపలో 60, అనంతపురంలో 53, విశాఖపట్నంలో 52, నెల్లూరులో 51 షాపులకు సంబంధించి కేటాయింపు ప్రక్రియ జరగనుంది. కొత్తగా ఎంపికయ్యే లైసెన్సుదారుల కాలపరిమితి 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి లాటరీ వరకు మొత్తం ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 5న జరిగే లాటరీతో 807 మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సుదారులు ఖరారు కానున్నారు.
