Supreme Court: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ ప్రక్రియలో సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ మరియు పీఎస్‌యూ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీఎంసీ సవాలు చేసింది.
అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జోయమల్య బాగ్చీతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించి, కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థించింది.
కౌంటింగ్‌లో కేంద్ర ఉద్యోగులను మాత్రమే నియమించడం పక్షపాతానికి దారితీస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా చేర్చాలని టీఎంసీ వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, కేంద్ర ఉద్యోగులు విధుల్లో భాగంగా పనిచేస్తారని, వారికి రాజకీయ అనుబంధం ఉండదని స్పష్టం చేసింది. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంలో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది.
ఎన్నికల నిర్వహణలో సిబ్బంది నియామకంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ఎన్నికల సంఘానిదేనని కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాజకీయ పార్టీలను సంప్రదించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఈ తీర్పు మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.