IPL 2026 playoffs: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకోగా ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే కొన్ని జట్లు టాప్-4 స్థానాలను దాదాపు ఖాయం చేసుకున్నప్పటికీ.. నాలుగో స్థానం కోసం మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
రాజత్ పటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ ఈ సీజన్‌లో నిలకడైన ప్రదర్శన చేస్తూ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లతో బలమైన స్థితిలో ఉంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ జట్టు సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మంచి అవకాశాల్లో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం అయ్యే అవకాశం ఉంది. అయితే అసలు పోటీ మాత్రం నాలుగో స్థానం కోసం జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇంకా రేసులో కొనసాగుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ తొలి దశలో అద్భుతంగా రాణించినా వరుస ఓటములతో ఒత్తిడిలో పడింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాజస్థాన్ రాయల్స్‌కు కూడా ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది.
ముంబై, ఢిల్లీ, లక్నో జట్లపై విజయాలు సాధించాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా లక్నో, హైదరాబాద్, గుజరాత్‌పై జరిగే మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవకపోతే అవకాశాలు కష్టమవుతాయి.
ఈసారి నెట్ రన్‌రేట్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పలు జట్లు సమాన పాయింట్లతో ముగించే పరిస్థితి కనిపిస్తుండటంతో.. చివరి లీగ్ మ్యాచ్ వరకు ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది.








