Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి పూర్తిగా మారిందని, ఒకప్పుడు ఇతర రాష్ట్రాలను ఆశ్రయించిన పెట్టుబడిదారులు ఇప్పుడు స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సంక్షేమంతో పాటు ఆర్థికాభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న పీ4 (Public-Private-People Partnership) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు భారీ పరిశ్రమలను తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 వేల మంది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తోందని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఉద్యోగాలతో పాటు వ్యవస్థాపకుల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. డ్వాక్రా ఉద్యమం మహిళలను ఆర్థికంగా నిలబెట్టినట్లే, భవిష్యత్‌లో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రజల జీవన ప్రమాణాల పెంపే తమ పాలనకు ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ALSO READ: Union Cabinet | మోడీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రోడ్లు, రైల్వే, మెట్రోలకు భారీ నిధులు








