అమరావతిని గ్లోబల్ మెడ్-టెక్ హబ్‌గా తీర్చిదిద్దే బైజర్.. వైద్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక అడుగు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి మెడ్-టెక్ హబ్‌గా, అలాగే “క్వాంటం వ్యాలీ”గా తీర్చిదిద్దే దిశగా కిమ్స్ మెడికల్ కాలేజ్ మరియు (BISER – బొల్లినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కీలక ముందడుగు వేసాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” విజన్‌కు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అమరావతిలోని నిడమర్రులో ఈ ప్రాజెక్టుకు ఘనంగా శంకుస్థాపన జరిగింది.
లక్ష మంది మెడిటెక్ నిపుణుల తయారీ లక్ష్యం
ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రాన్ని మెడికల్ మరియు టెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. లక్ష మంది మెడిటెక్ నిపుణులను తయారు చేసి, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో పెరుగుతున్న నర్సింగ్, పారామెడికల్ అవసరాలను తీర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భాషా నైపుణ్యాలు, సాంకేతిక శిక్షణ అందించనున్నారు.
క్వాంటం టెక్నాలజీతో వైద్యరంగంలో కొత్త దిశ
అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం కంప్యూటింగ్ సామర్థ్యాన్ని వైద్య రంగంతో అనుసంధానించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ముఖ్యంగా జెనెటిక్ రీసెర్చ్, ప్రిసిషన్ మెడిసిన్, వేగవంతమైన రోగ నిర్ధారణలో క్వాంటం టెక్నాలజీ వినియోగం ద్వారా దేశంలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు.
25 ఎకరాల్లో భారీ మౌలిక వసతులు
25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ క్యాంపస్‌లో 1000 పడకల టీచింగ్ హాస్పిటల్, 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయనున్నారు. రోబోటిక్ సర్జరీ, అత్యాధునిక ఐసీయూలు, ఎమర్జెన్సీ సేవలు, అంతర్జాతీయ సదస్సుల కోసం 2000 సీట్ల ఆడిటోరియం, వైద్య పరికరాల తయారీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి.
7 ప్రత్యేక విభాగాలతో విద్యా విప్లవం
బైజర్‌లో మెడిసిన్, నర్సింగ్, ఎలైడ్ హెల్త్ సైన్సెస్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఏఐ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్, క్వాంటం మెకానిక్స్ వంటి 7 కీలక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు చదువుకుంటూనే సంపాదించే “ఎర్న్ వైల్ యు లెర్న్” విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. హాస్పిటల్స్, ల్యాబ్స్‌లో ప్రత్యక్ష శిక్షణతో విద్యార్థులను పూర్తిస్థాయి ఉద్యోగ నిపుణులుగా తీర్చిదిద్దనున్నారు.
పరిశోధనలకు ప్రాధాన్యం
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంగా వైద్య పరికరాల దిగుమతిని తగ్గించే దిశగా పరిశోధనలు చేపడుతున్నారు. అంధుల కోసం “దృష్టి AI గ్లాసెస్”, డ్రోన్ ఆధారిత ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్ వంటి వినూత్న ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తున్నారు.
రైతుల త్యాగానికి గౌరవం
అమరావతి రైతుల సహకారాన్ని గుర్తిస్తూ యూనివర్సిటీలోని తరగతి గదులకు భూములిచ్చిన రైతు కుటుంబాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 15, 2027 నాటికి తొలి దశ ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగనున్నాయి.








