Imran Khan: పాకిస్థాన్‌లో జైలు జీవితం గడుపుతున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొనసాగుతున్న
ఉత్కంఠకు తెరపడేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో, వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని దేశ సుప్రీంకోర్టు(Pakistan Supreme Court) ఆదేశించింది. పీటీఐ నేతలు, ఇమ్రాన్ కుటుంబ సభ్యులు చాలాకాలంగా చేస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. పార్టీ ప్రతినిధి నయీమ్ హైదర్ పంజూతా ప్రకారం.. ఇమ్రాన్‌ను 48 గంటల్లోగా షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 16 వరకు అక్కడే ఉంచి వైద్య పర్యవేక్షణలో చికిత్స అందించాలని సూచించింది.
73 ఏళ్ల ఇమ్రాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. జైలు సమయంలో ఆయన కుడి కంటిచూపు గణనీయంగా తగ్గిందని న్యాయవాదులు చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఇమ్రాన్ వైద్య నివేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన, ఒత్తిడి, గుండె దడ, అధిక రక్తపోటు వంటి అంశాలు నివేదికల్లో ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పీటీఐ స్వాగతించింది. ఇమ్రాన్ పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలని పార్టీ కోరింది. కాగా, 2022లో ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత ఇమ్రాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో తీర్పులు నిలిచిపోగా, మరికొన్నింటిపై అప్పీళ్లు కొనసాగుతున్నాయి. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన ఆరోపిస్తున్నారు.
ALSO READ: Birthday Wishes | నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు
