అమెరికా పౌరసత్వం పొందాలంటే గ్రీన్ కార్డు చాలదని, పౌరసత్వానికి ప్రత్యేక ప్రమాణాలు ఉండాలని ట్రంప్ సర్కారు వెల్లడించింది. ఇదే సమయంలో సంపన్నుల కోసం కొత్తగా గోల్డ్ కార్డును ప్రవేశపెట్టింది. ‘ట్రంప్ కార్డ్’ పేరుతో విడుదలైన ఈ కార్డు ధర 5 మిలియన్ డాలర్లు. ఈ కార్డుతో అమెరికా పౌరసత్వం పొందవచ్చని ట్రంప్ ప్రకటించారు.
ఈ గోల్డ్ కార్డు ద్వారా విదేశీ సంపన్నులకు పౌరసత్వం సులభతరం అవుతుంది. ముఖ్యంగా భారత్, రష్యా వంటి దేశాల కార్పొరేట్ రంగానికి చెందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది ట్రంప్ తీసుకొచ్చిన వ్యూహాత్మక ప్రకటనగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ట్రంప్ ఈ కార్డు ఫస్ట్ లుక్‌ను విలేకరుల సమక్షంలో విడుదల చేశారు. కార్డు పై ట్రంప్ ముఖచిత్రం, ఆయన సంతకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రంప్ మాట్లాడుతూ, “ఈ కార్డు చాలా స్పెషల్. దీని విలువ తెలివైనవారికి మాత్రమే తెలుస్తుంది. ఇది ట్రంప్ కార్డు” అని పేర్కొన్నారు. మొదటి కార్డును తానే కొనుగోలు చేశానని తెలిపారు.
ఈ గోల్డ్ కార్డు రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని ట్రంప్ చెప్పారు. “మీ దగ్గర 5 మిలియన్ డాలర్లు ఉంటే… మీకూ ఈ కార్డు దక్కుతుంది” అని వ్యాఖ్యానించారు. అమెరికాలో పౌరసత్వం కోసం పోటీ తీవ్రంగా మారిన ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.