LIVE
Wednesday, November 18, 2026
LIVE
LIVE

India Philippines Defence Deal | భారత్‌ ఆయుధాల కోసం క్యూ కడుతున్న ఫిలిప్పీన్స్‌.. భారీ డిఫెన్స్ డీల్‌కు రంగం సిద్ధం

by Bajaswamy
2 views
India Philippines Defence Deal

India Philippines Defence Deal: చైనా సైనిక విస్తరణ.. దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఈ పరిణామాల మధ్య ఫిలిప్పీన్స్‌ తన రక్షణ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసుకునే పనిలో పడింది. ఇందుకోసం భారత్‌ను కీలక భాగస్వామిగా ఎంచుకుంటోంది. ఇప్పటికే భారత బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేసిన ఫిలిప్పీన్స్‌.. ఇప్పుడు మరిన్ని అత్యాధునిక ఆయుధ వ్యవస్థలపై ఆసక్తి చూపుతోంది. బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశంగా ఫిలిప్పీన్స్‌ గుర్తింపు పొందింది. ఇప్పటికే మూడు బ్రహ్మోస్‌ బ్యాటరీలను అందుకున్న ఆ దేశం.. వాటి పనితీరుపై సంతృప్తితో మరో ఆరు బ్యాటరీలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ఫిలిప్పీన్స్‌ నౌకాదళ యుద్ధ నౌకలపై కూడా బ్రహ్మోస్‌ క్షిపణులను అమర్చే ప్రతిపాదనను భారత్‌ ముందుకు తెచ్చింది.

మరోవైపు భారత ఆకాష్‌ వైమానిక రక్షణ వ్యవస్థపైనా ఫిలిప్పీన్స్‌ ఆసక్తి చూపుతోంది. తమ సైన్యం, నౌకాదళం, వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ఐదు కంటే ఎక్కువ ఆకాష్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్లను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌లో ఆకాష్‌ వ్యవస్థ పనితీరుపై భారత అధికారులు ఫిలిప్పీన్స్‌ రక్షణ ప్రతినిధులకు వివరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత పినాకా మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థపైనా ఆ దేశం దృష్టి సారించింది. ఈ ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక, వాణిజ్య నిబంధనలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

రక్షణ రంగంలో భాగస్వామ్యం ఆయుధాల కొనుగోళ్లకే పరిమితం కావడం లేదు. భారత రక్షణ సంస్థ MKU ఫిలిప్పీన్స్‌లో బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఫిలిప్పీన్స్‌ ఆర్మీకి రక్షణ పరికరాలు సరఫరా చేసేందుకు సుమారు రూ.1,400 కోట్ల విలువైన ఆర్డర్‌ను కూడా దక్కించుకుంది. హెలికాప్టర్ల కొనుగోలు, అంతరిక్ష సాంకేతికతలో సహకారంపైనా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు, భారత ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించుకునేలా ఫిలిప్పీన్స్‌లో పరిశీలన కేంద్రాల ఏర్పాటుకు భారత్‌ ప్రతిపాదించింది. దీనివల్ల దక్షిణ చైనా సముద్రంలో నౌకల కదలికలను పర్యవేక్షించే సామర్థ్యం పెరుగుతుంది. ఇరు దేశాల సైనికుల మధ్య సంయుక్త విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలను విస్తరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే.. చైనా నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌కు భారత్‌ కీలక రక్షణ భాగస్వామిగా మారుతోంది. క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలు, సైనిక శిక్షణ, అంతరిక్ష సహకారం.. ఇలా అన్ని రంగాల్లో సంబంధాలను విస్తరిస్తూ రెండు దేశాలు దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా అడుగులు వేస్తున్నాయి.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More