Sheikh Hasina: షేక్ హసీనా రాజకీయ భవిష్యత్తుపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆమెకు ఇప్పుడు పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు వ్యవహారం కొత్త సవాలుగా మారింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్‌ఐసీ) కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు ఆమె తరఫు న్యాయవాది అధికారికంగా లేఖ రాశారు. లండన్‌కు చెందిన ప్రముఖ బారిస్టర్ స్టీవెన్ పౌల్స్ ద్వారా ఈ దరఖాస్తు సమర్పించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
నవంబర్ 9న పంపిన విజ్ఞప్తికి స్పందన రాకపోవడంతో నవంబర్ 19న మరోసారి ఫాలో-అప్ లేఖ పంపించారు. హసీనా స్వయంగా సంతకం చేసిన అధికార పత్రాన్ని కూడా జతచేసి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన ప్రజా ఉద్యమం నేపథ్యంలో దేశం విడిచి భారత్‌కు వచ్చిన హసీనా.. డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రద్దయిన పత్రాల స్థానంలో కొత్త పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే, హసీనా అభ్యర్థనను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. మానవతా వ్యతిరేక నేరాల కేసులో ఆమెకు మరణశిక్ష విధించబడిందని, అప్పీల్ గడువు కూడా ముగిసిందని అధికారులు పేర్కొన్నారు. ఆమెకు కొత్త పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రసక్తే లేదని చీఫ్ ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం, న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు. భారత్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం ద్వారా హసీనాను స్వదేశానికి రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి, స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న హసీనా ప్రయత్నాలకు పాస్‌పోర్ట్ వివాదం, న్యాయపరమైన చిక్కులు అడ్డంకిగా మారాయి. ఈ వ్యవహారంలో భారత్, బంగ్లాదేశ్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Akash Deep wickets | కివీస్ దూకుడుకు బ్రేక్.. ఒక్క వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు
