Russian Plane Crash: ఆకాశంలో ప్రయాణం చేస్తున్న విమానం ఒక్కసారిగా మృత్యుశకటంగా మారింది. సాంకేతిక సమస్య కారణమో.. మరేదైనా కారణమో తెలియదు కానీ, రష్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన సైబీరియా ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. రష్యాలోని కెమెరోవో ప్రాంతంలో ఏఎన్-12 (An-12) రకం సైనిక రవాణా విమానం కుప్పకూలింది. మంగళవారం సాధారణ ప్రయాణంలో ఉన్న ఈ విమానం యగునోవో గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ శాఖను ఉటంకిస్తూ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో విమానం కూలిపోవడంతో పెద్ద స్థాయిలో ప్రజలకు ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
విమానానికి అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు కెమెరోవో గవర్నర్ ఇల్యా సెరెద్యుక్ వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ప్రమాద ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రాకపోకలను నిలిపివేశారు. వైద్య బృందాలతో పాటు హెలికాప్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రాథమికంగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. విమానంలో ఏ తరహా సరుకు రవాణా చేస్తున్నారనే వివరాలు కూడా వెల్లడికాలేదు. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకాశం నుంచి మండుతున్న వస్తువు వేగంగా కిందకు పడిపోవడం, ఆ వెంటనే భారీ పేలుడు సంభవించినట్లు వీడియోలో కనిపిస్తోంది. మొత్తంగా, 19 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదంపై రష్యా అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. విచారణ పూర్తయితేనే విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.
ALSO READ: Sakshi Dhoni Emotional Post | మహీ.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. సాక్షి ఎమోషనల్ పోస్ట్ వైరల్
