Hyderabad Rain Alert: భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్‌లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధమైంది. భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్‌లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు ట్రాఫిక్ సమస్యల్లో చిక్కుకోకుండా వీలైనంత త్వరగా కార్యాలయాల నుంచి బయలుదేరేలా సంస్థలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులను ముందుగానే ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రత్యేకించి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో గతంలో వర్షాల కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈసారి ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచే దశలవారీగా ఉద్యోగులకు లాగౌట్ అవకాశం కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఒకేసారి భారీగా వాహనాలు రోడ్లపైకి రావడం తగ్గి ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, నగరంలోని లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాలపై జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. అవసరమైన చోట్ల రక్షణ చర్యలు చేపడుతూ అత్యవసర సేవలు అంతరాయం లేకుండా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరవాసులు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.








