KTR: జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా చేనేత కార్మికులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను తమ కళాత్మక నైపుణ్యంతో ప్రపంచానికి పరిచయం చేస్తున్న నేతన్నల సేవలు అమూల్యమని కొనియాడారు. చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ నేతన్నలు తమ కష్టం, నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, సమైక్య పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కేటీఆర్ గుర్తుచేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల చేనేత రంగానికి మళ్లీ ఊతం లభించిందని పేర్కొన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరల పంపిణీ, రుణమాఫీ, పెన్షన్లు వంటి పథకాల ద్వారా వేలాది నేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమాలు చేనేత వృత్తికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయని, నేతన్నల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చాయని అన్నారు. భవిష్యత్తులో కూడా చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధి, నేతన్నల సంక్షేమం కోసం బీఆర్ఎస్ తన కట్టుబాటును కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ALSO READ: Batik Air Flight | విమానం ఎగురుతుండగానే డోర్ తెరవాలనుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందంటే?








