తెలంగాణ ఇంధన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్(Naini Coal Block) నుంచి తొలి బొగ్గు సరుకు తెలంగాణకు చేరుకోవడంతో సింగరేణి(Singareni) చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) దీనిని రాష్ట్ర ఇంధన భద్రతకు చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. గత తొమ్మిదేళ్లుగా వివిధ కారణాలతో ముందుకు సాగని నైనీ గని ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బొగ్గు ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించినట్లు వెల్లడించారు.
నైనీ గని నుంచి బయలుదేరిన తొలి రైలు 1,131 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెలంగాణలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చేరుకుంది. ఈ రైలులో 59 వ్యాగన్ల ద్వారా సుమారు 4 వేల టన్నుల అత్యుత్తమ G-10 గ్రేడ్ బొగ్గు రవాణా చేశారు. ఈ బొగ్గు సరఫరాతో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధన లభ్యత మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్‌లో తెలంగాణకు నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఇలాంటి చర్యలు కొనసాగుతాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన సింగరేణి అధికారులు, ఇంజినీర్లు, కార్మికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.