కుప్పం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డ్ పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం తాసిల్దారు ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి నెలా దళితవాడల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని తాసిల్దారు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను తాసిల్దార్‌కు వివరించారు. పలార్లపల్లి, పరమసముద్రం స్మశాన భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు యత్నాలు జరుగుతున్నాయని, అలాగే పరమసముద్రం చెరువు మీద కూడా కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆయకట్టుదారులు తెలిపారు. వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
గ్రామస్థుల సమస్యలను గమనించిన కుప్పం తాసిల్దారు, ఈ విషయాన్ని అధికారికంగా పరిశీలించి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పరమసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్సింహ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఆసక్తిగా పాల్గొని, తమ అభిప్రాయాలను తెలియజేశారు.