ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న నేతృత్వంలో ఉపాధి హామీ కూలీలు తమ బకాయిల చెల్లింపును కోరుతూ దేవరాపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆకులు పట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. “బకాయిలు చెల్లించండి – తిండి అయినా పెట్టండి!” అంటూ నినాదాలు చేశారు. గత ఐదు వారాలుగా కూలీల బిల్లులు చెల్లించకపోవడంతో, వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో, చాలా మంది కూలీలు గ్రామాలు వదిలి వలస వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కావాలనే ఉపాధి హామీ కూలీల బిల్లుల చెల్లింపును ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. గత మూడు సంవత్సరాలుగా బడ్జెట్‌లో నిధులకు కోత విధించడంతో పాటు, మెటీరియల్ ఛార్జీలు పెంచడం వల్ల కూలీల పరిస్థితి మరింత కష్టంగా మారిందన్నారు. కాంట్రాక్టర్లకు ముందుగా బిల్లులు చెల్లించి, కూలీలను వెనుక పడేస్తున్నారని విమర్శించారు.
గతంలో వేసవి కాలంలో 20% సమ్మర్ ఎలవెన్స్ ఇచ్చే విధానం ఉండేదని, అయితే ఇప్పుడు పూర్తిగా తొలగించారని పేర్కొన్నారు. మెడికల్ కిట్లు, తట్టా, గునపాపం, టెంట్లు వంటి ఉపాధి హామీ పథకం కింద ఉండే మౌలిక సదుపాయాలకు కూడా నిధులు తగ్గించారని తెలిపారు. వెంటనే సమ్మర్ ఎలవెన్స్‌ను 30% గా పెంచి చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని, నెహ్రూ చౌక్ వద్ద భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని డి. వెంకన్న ప్రకటించారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.