కోవూరు మండలం పాటూరులో వ్యవసాయ శాఖ జేడీ సీ. సత్యవాణి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయగా, రైతులు తమ సమస్యలను ఉద్ధేశించి తీవ్రంగా మాట్లాడారు. తేమశాతం పేరుతో ధాన్యాన్ని కొలవడం లేదని, ఇప్పటికీ కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్ష్మీశెట్టి శీనయ్య మాట్లాడుతూ, మూడునెలల క్రితమే ఎమ్మెల్యేకు ఈ సమస్య గురించి చెప్పినప్పటికీ, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం గ్రామంలో 30 శాతం కోతలు పూర్తయ్యాయి. అయితే, ధాన్యం ఆరబెట్టేందుకు పట్టలు లేవు, వర్షం వస్తే ఏమి చేయాలనే ప్రశ్నలు అధికారుల ముందు ఉంచారు.
దళారులు క్వింటాలకు రూ. 15,200కే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తేమశాతం తగ్గిన తర్వాతే కొనుగోలు చేస్తామని చెబుతోందని రైతులు ఆక్షేపించారు. గత సీజన్లో పుట్టి రూ. 24వేలకు అమ్మితే, ఇప్పుడు రూ. 15,200కే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుదర రైతులకు అందడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో అసంతృప్తి నెలకొన్నదని రైతులు విమర్శించారు.
పౌరసరఫరాల మంత్రి మనోహర్ క్వింటాకు రూ. 300 అదనంగా ఇస్తామని చెప్పినా, ఇప్పటి వరకు ఎక్కడా అమలు కాలేదని రైతులు ప్రశ్నించారు. ధాన్యాన్ని ఎక్కడ ఆరబెట్టాలని, ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని, రైతుల కష్టాలను పట్టించుకోవడంలో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అల్లాడిపోతున్నారని తెలిపారు.
.