వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. బుమ్రాను ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌లకు ఎంపిక చేయకూడదని నిర్ణయించిన బోర్డు, అతని ఫిట్‌నెస్ మరియు భవిష్యత్ పర్యటనలను దృష్టిలో పెట్టుకునిఎంపిక చేయలేదు అని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా తిరిగి జట్టులో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జూన్ 6 నుంచి ముల్లన్‌పూర్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా, జూన్ 14 నుంచి ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లకు ప్రకటించిన జట్లలో బుమ్రా లేకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. అదే విధంగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా టెస్టుకు విశ్రాంతి ఇచ్చారు.
టెస్టు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో కేఎల్ రాహుల్‌ను నియమించారు. అయితే పంత్ టెస్టు జట్టులో మాత్రం కొనసాగనున్నాడు. వన్డే జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు.
ఇక దేశీయ క్రికెట్‌లో ప్రతిభ చూపిన యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశాలు కల్పించింది. స్పిన్నర్ మనవ్ సుతార్, పేసర్ గుర్నూర్ బ్రార్ తొలిసారిగా టెస్టు జట్టులో ఎంపికయ్యారు. వన్డే జట్టులో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం లభించింది. ఇషాన్ కిషన్ రెండో వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చాడు.
టెస్టు జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు వన్డే జట్టులో ఉన్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూనే, సీనియర్ల వర్క్‌లోడ్‌ను సమతుల్యం చేసే దిశగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటోంది.








