దేశవ్యాప్తంగా 35 రకాల మెడిసిన్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, నరాలకు సంబంధించిన డ్రగ్స్, గర్భధారణకు సంబంధించిన మెడిసిన్‌లు ఉన్నాయి. ఈ మందులు సరైన అనుమతి లేకుండానే మార్కెట్‌లో ఉన్నాయని గుర్తించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మెడిసిన్‌లలో చాలా వరకు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మెడిసిన్‌లు కావడం విశేషం. ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్రగ్స్ కలిపి తయారయ్యే “కాక్టెయిల్” మెడిసిన్‌లపై ప్రమాదాలున్నట్లు గుర్తించారు. కొన్ని రాష్ట్రాలు శాస్త్రీయంగా నిర్ధారించకుండా ఈ మెడిసిన్‌లకు అనుమతులు ఇచ్చినట్లు డీసీజీఐ గుర్తించింది. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకుంది.
డీసీజీఐ లేఖ ప్రకారం, ఈ మెడిసిన్‌లపై తగిన ప్రమాణాలు, సేఫ్టీ టెస్టులు జరగలేదని వెల్లడించారు. డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టం 1940, NDCT రూల్స్ 2019 ప్రకారం సరైన ధ్రువీకరణ లేకుండా ఈ మందులకు లైసెన్సులు జారీ చేయడం తప్పని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ చర్యల వల్ల దేశవ్యాప్తంగా డ్రగ్ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ రంగంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఔషధ కంపెనీలు కూడా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం మరింత బలపడనుంది. ప్రజల ఆరోగ్య భద్రత కోసం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆరోగ్య రంగానికి కీలక మలుపుగా నిలవనుంది.