గుంతకల్ ప్రాంతంలో కాల్ సెంటర్ పేరిట నడుస్తున్న అసలు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లూయిస్ అనే వ్యక్తి రెండు సంవత్సరాలుగా కాల్ సెంటర్ ముసుగులో అసభ్యకరమైన వీడియోలు రూపొందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని నిషేధిత వెబ్‌సైట్లకు విక్రయించి, బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు.
ఈ వ్యవహారంలో అతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేష్, జోత్స్నలు సహకరిస్తున్నారని గుర్తించి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈగిల్ వింగ్ ఐజి ఆకే రవిక్రిష్ణకు ముందుగానే సమాచారం అందగా, సైబర్ పోలీసుల బృందం ప్రత్యేక దృష్టి పెట్టి ముఠా కార్యకలాపాలను బయటపడేసింది. విచారణలో మొత్తం పదకొండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టు వెల్లడైంది.
ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులిస్తామని ప్రలోభ పెట్టి యువతిని యువకులను ఆకర్షించి, వారితో పోర్న్ వీడియోలు రూపొందించి, కొన్ని లైవ్ షోలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుంతకల్‌లో ఇందుకోసం ప్రత్యేకంగా స్టూడియో సెటప్ ఏర్పాటు చేశాడని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తూ, సైప్రస్‌కు చెందిన సంస్థలతో ఆన్‌లైన్ ఒప్పందాలు కుదుర్చుకొని ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడని విచారణలో తేలింది. ఈ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ప్రలోభాలకు లోనవకండని ఐజి ఆకే రవిక్రిష్ణ హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.