ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందిన చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వందేభారత్ రైలు ఇప్పుడు పరుగులు తీయనుంది. కట్రా-శ్రీనగర్ మధ్య ఈ రైలు సేవలు ప్రారంభం కానుండటంతో కాశ్మీర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది పెద్ద ఊరట. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ రైలు సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం కట్రా నుంచి శ్రీనగర్ వరకు రోడ్డుమార్గంలో ప్రయాణించాలంటే దాదాపు ఏడుగంటల సమయం పడుతోంది. అయితే వందేభారత్ రైలు ద్వారా ఇది కేవలం మూడుగంటలలోనే పూర్తి కానుంది. ఇది ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడమే కాదు, కాశ్మీర్ లోయలో రైలు మార్గాన్ని ప్రారంభించే తొలి ఘట్టంగా నిలవనుంది.
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా చినాబ్ నది మీద కట్టిన రైల్వే వంతెన ప్రపంచంలోనే ఎత్తైనది కావడం విశేషం. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉండే ఈ వంతెన ఎఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉంది. భారత రైల్వే టెక్నాలజీలో ఇది ఒక గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. వందేభారత్ రైలు ఈ వంతెనపై ప్రయాణించడం మరో గర్వకారణం.
ఈ రైలు ప్రారంభం వల్ల కాశ్మీర్ లోయను మిగతా భారతదేశంతో కలుపుతూ ప్రయాణానికి సౌలభ్యం కలుగుతుంది. అంతేకాకుండా, పర్యాటక అభివృద్ధికి, వాణిజ్యానికి ఇది బలమైన బాటలు వేస్తుంది. వందేభారత్ రైలు వేగవంతమైన సేవలను అందించడమే కాకుండా, చినాబ్ వంతెన మీదుగా వెళ్లడం ద్వారా ఇది ఒక దృశ్యపరంగా గొప్ప అనుభూతినిస్తుంది.