Osey Ramulamma Song: తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఓ పాట.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘ఒసేయ్ రాములమ్మ’ గీతం.. ఈసారి రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమాలో సరికొత్త రూపంలో సందడి చేయనుంది. అయితే ఈ ఐకానిక్ పాటను మళ్లీ రూపొందించడం వెనుక ఉన్న బాధ్యత, తన మనసులో కలిగిన భయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతంలో, సుద్దాల అశోక్ తేజ సాహిత్యంతో రూపుదిద్దుకున్న ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్ అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది. 1997లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఈ పాటను రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ చిత్రం కోసం రీక్రియేట్ చేశారు.
రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి రీక్రియేట్ చేసిన పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘ఒసేయ్ రాములమ్మ’ ఒక చరిత్ర సృష్టించిన సినిమా అని గుర్తుచేసుకున్నారు. అలాంటి గొప్ప పాటను మళ్లీ రూపొందిస్తున్నామని తెలిసినప్పుడు కొంత భయం కలిగిందన్నారు. ఎందుకంటే ఒరిజినల్ పాటతో పోల్చడం సరికాదని, దానికి ఉన్న ప్రత్యేకతను అందుకోవడం పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ పాటకు తగిన గౌరవం ఇచ్చేలా తమ బృందం ప్రయత్నించిందని చెప్పారు. ఈ కొత్త వెర్షన్‌లో వందేమాతరం శ్రీనివాస్ స్వయంగా ఆలపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పాత పాటకు అందించిన ఆదరణనే కొత్త పాటకూ అందించాలని అభిమానులను కోరారు.
మరోవైపు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ‘మైసా'(Mysaa) గర్జన ఇప్పటికే వినిపించిందని, ఈ నెల 27న థియేటర్లలో ఆ సింహాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రవీంద్ర పుల్లె, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌తో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి, ఒకప్పటి సూపర్ హిట్ పాటకు కొత్త తరహా రూపాన్ని అందిస్తూ ‘మైసా’ బృందం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రష్మిక నటన, పాటలోని కొత్త ప్రయోగం వెండితెరపై ఎలాంటి అనుభూతిని అందిస్తాయో తెలియాలంటే ఈ నెల 27 వరకు వేచి చూడాల్సిందే!
