Ajit Doval: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని, వారు వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా జాతి నిర్మాణానికి తోడ్పడే ఆలోచనలు చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అంటే నచ్చినట్లు జీవించడం కాదని, దేశ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా పనిచేయడమే నిజమైన స్వేచ్ఛ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎంపికైన అజిత్ దోవల్, పుణేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను ప్రతి యువకుడు లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. స్వేచ్ఛ కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు జరిగాయని, వాటి గురించి తెలుసుకున్నప్పుడే స్వాతంత్య్రం యొక్క అసలు విలువ అర్థమవుతుందని అన్నారు. లోక్‌మాన్య బాల గంగాధర్ తిలక్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అసామాన్య ధైర్యంతో ప్రజలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారని దోవల్ గుర్తు చేశారు.
భయపడకుండా దేశం కోసం నిలబడే తిలక్ వంటి నాయకుల స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చాలా మంది యువత భారత్ ఎప్పటి నుంచో ఇదే స్థితిలో ఉందని భావిస్తారని, కానీ దేశ చరిత్రను అధ్యయనం చేస్తే ఎన్నో మార్పులు, త్యాగాలు, విజయాలు కనిపిస్తాయని అన్నారు. దేశ అభివృద్ధి, భద్రత, సమగ్రత కోసం యువత దూరదృష్టితో ముందుకు సాగితేనే బలమైన భారత నిర్మాణం సాధ్యమవుతుందని అజిత్ దోవల్ పేర్కొన్నారు.








