PM Modi: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఇది కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. తెలుగులో ప్రజలకు అభివాదం చేసిన ఆయన, సింహాచలం అప్పన్న స్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత వేగం తీసుకొస్తాయని అన్నారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన ధిమ్సా నృత్యం రెండు చారిత్రాత్మక ఘట్టాలుగా నిలిచాయని మోడీ తెలిపారు. ఈ భారీ సాంస్కృతిక ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు. అల్లూరి సీతారామరాజు పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో కొన్ని కుటుంబాల పేర్లకే ప్రాధాన్యం ఉండేదని, ప్రస్తుతం దేశం కోసం సేవలందించిన మహనీయులకు గుర్తింపు లభిస్తోందన్నారు.
2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 166కు పెరిగిందని మోడీ తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలకు కూడా విమాన సేవలు విస్తరించాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు, రైల్వేలు, జాతీయ రహదారులు, పరిశ్రమల రంగాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తోందని ప్రధాని అన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: OTTలోకి అఖిల్ ‘లెనిన్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!








