అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వాటాలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించే ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో(Gianni Infantino) ప్రకటించారు. ఈ ప్రణాళిక ద్వారా సుమారు 20 శాతం వాటాలను విక్రయించి దాదాపు 402 కోట్ల డాలర్లు సమీకరించాలని ఫిఫా భావించింది. అయితే సభ్య దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ప్రపంచకప్‌తో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల నిర్వహణకు ఆర్థిక బలం పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళికను రూపొందించారు. మొత్తం 211 సభ్య దేశాలు ఉన్న ఫిఫాలో ప్రైవేట్ పెట్టుబడులకు ఆమోదం తెలిపితే ప్రతి సభ్య దేశానికి 40 మిలియన్ డాలర్లు అందజేస్తామని ఇన్‌ఫాంటినో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రణాళిక ఫుట్‌బాల్ సంఘాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (UEFA) దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. మహిళల, పురుషుల ప్రపంచకప్‌లలో ప్రైవేట్ ఇన్వెస్టర్లకు భాగస్వామ్యం కల్పించడం క్రీడ స్వతంత్రతకు విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడింది. ఒకవేళ ఈ ప్రణాళిక అమలైతే ప్రపంచకప్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా యూఈఎఫ్ఏ ప్రస్తావించింది.
సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు పెరగడం, సంస్థలో విభేదాలు తలెత్తడం వల్ల తమ లక్ష్యాలు నెరవేరే పరిస్థితి లేదని ఇన్‌ఫాంటినో తెలిపారు. ఫుట్‌బాల్ అభివృద్ధి, సభ్య దేశాల ఐక్యతే తమకు ముఖ్యమని పేర్కొంటూ, వివాదాస్పద పెట్టుబడి ప్రణాళికను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ALSO READ: PM Modi | ఉత్తరాంధ్ర ప్రగతికి శ్రీకారం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు








