Union Cabinet: దేశ ఆర్థిక, ఇంధన, వ్యవసాయ, క్రీడా రంగాలకు ఊతమిచ్చే నాలుగు కీలక పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. మొత్తం రూ.4.25 లక్షల కోట్లకు పైగా వ్యయంతో అమలు కానున్న ఈ నిర్ణయాలు ఇంధన స్వయం సమృద్ధి, రైతు సంక్షేమం, సముద్ర వనరుల వినియోగం, క్రీడా రంగ అభివృద్ధికి బలాన్నివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ఇవి కీలక అడుగులుగా ప్రభుత్వం పేర్కొంది.
ఇందులో భాగంగా “రూ.5,070 కోట్లతో ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (PM-SSY)'” కు ఆమోదం లభించింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమలయ్యే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్నారు. జలాశయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా భూసేకరణ అవసరం తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తిని పెంచేందుకు రూ.84,084 కోట్లతో ‘సముద్ర మంథన్’ జాతీయ ఆఫ్‌షోర్ అన్వేషణ పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డీప్‌వాటర్, అల్ట్రా డీప్‌వాటర్ ప్రాంతాల్లో శాస్త్రీయ అన్వేషణ చేపట్టి సముద్ర గర్భంలోని చమురు, గ్యాస్ నిల్వలను వెలికితీయడం దీని ప్రధాన లక్ష్యం.
రైతులకు ఊరట కలిగించే PM-KISAN పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27 నుంచి 2030-31 వరకు అమలు కోసం రూ.3.15 లక్షల కోట్లను కేటాయించింది. డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం కొనసాగనుంది. అదే సమయంలో ఖేలో ఇండియా పథకాన్ని కూడా మరో ఐదేళ్లు పొడిగిస్తూ రూ.36,441 కోట్ల నిధులను కేటాయించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయి శిక్షణ, శాస్త్రీయ మద్దతు అందించేందుకు కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.
ALSO READ: Southwest Monsoon | రైతులకు ఊరట.. ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ








