Tamil Nadu Budget: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మరియా విల్సన్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ప్రకటించారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికే అత్యధిక ప్రాధాన్యం లభించింది. పాఠశాల విద్యకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యకు రూ.8,393 కోట్లు కేటాయించారు. కళాశాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం వెట్రి ల్యాప్టాప్ పథకానికి రూ.2,000 కోట్లు ప్రకటించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల కోసం సూపర్ క్లీన్–సూపర్ క్యాంపస్ పథకానికి రూ.139 కోట్లు కేటాయించి 10 వేల పాఠశాలల్లో అమలు చేయనున్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త పాఠ్యప్రణాళిక రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే కొత్త ప్రభుత్వ లా కాలేజీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
వైద్య ప్రవేశాల్లో NEET పరీక్షకు వ్యతిరేకంగా తమ వైఖరిని కొనసాగిస్తూ, ఇంటర్ మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు స్పష్టం చేసింది. సామాజిక న్యాయశాఖకు రూ.3,937 కోట్లు, అయోధ్యదాస పండితార్ అభివృద్ధి పథకానికి రూ.300 కోట్లు, 500 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు కేటాయించారు. యువజన సంక్షేమం, క్రీడలకు రూ.1,051 కోట్లు, సంప్రదాయ గ్రామీణ క్రీడల ప్రోత్సాహానికి ప్రత్యేకంగా రూ.42 కోట్లు ప్రకటించారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.








