MLA Ashok Dinda: టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా రాజకీయాల్లో మరోసారి తన ప్రభావాన్ని చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మొయినా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో దిండా 16,241 ఓట్ల మెజారిటీతో గెలిచి తన స్థానాన్ని మరింత బలపరిచారు. ఆయనకు మొత్తం 1,27,166 ఓట్లు రాగా, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్ మండల్ 1,10,925 ఓట్లు సాధించారు.
గత ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన దిండా, ఈసారి మరింత బలమైన మద్దతుతో విజయం సాధించడం గమనార్హం. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది తన విజయం కాదని, ప్రజల విశ్వాసానికి వచ్చిన ఫలితమని పేర్కొన్నారు. మొయినా ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని హామీ ఇచ్చారు.
క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, దిండా 2009 నుంచి 2013 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 13 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆయన, వన్డేల్లో 12 వికెట్లు, టీ20ల్లో 17 వికెట్లు సాధించారు.
ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు తీసుకున్నారు. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అదే ఏడాది బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుస విజయాలతో రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నారు.









