అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. దేశంలో వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఉన్నవారిని జైలుకు పంపడమో, స్వదేశానికి పంపడమో చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెరూ మహిళ కామిలా మునోజ్ అమెరికాలో అక్రమంగా ఉన్నారనే కారణంతో అరెస్టయి జైలుకి పంపబడింది.
2019లో కామిలా స్టడీ, వర్క్ వీసాతో అమెరికా వచ్చి, అక్కడ అమెరికన్ యువకుడు బ్రాడ్లే బార్టెల్ ను పెళ్లి చేసుకుంది. కోవిడ్ కారణంగా వాయిదా వేసుకున్న హనీమూన్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుపుకున్నారు. కానీ తిరిగి విస్కాన్సిన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే, వీసా గడువు ముగిసిందనే ఆరోపణలపై అమెరా అధికారులు అరెస్ట్ చేశారు. తన భార్యను విడిపించేందుకు బార్టెల్ న్యాయపోరాటం చేస్తున్నాడు.
తాను ట్రంప్ మద్దతుదారునని, ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కే ఓటు వేశానని బార్టెల్ తెలిపారు. అయినప్పటికీ, ట్రంప్ వలస విధానాల వల్లే తన భార్య జైలుకి వెళ్లిందన్న విషయం తెలిసినా, తాను ఇప్పటికీ ట్రంప్‌ను మద్దతు ఇస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అమెరికన్ల భద్రత కోసం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను తాను సమర్థిస్తానని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో బార్టెల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ట్రంప్‌కు ఓటేయడం వల్లే నీ భార్య ఇలా అయ్యింది” అంటూ కొందరు ధ్వజమెత్తుతుండగా, అతని కుటుంబానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత మెసేజ్‌లు వస్తున్నాయి. అయినప్పటికీ తాను ట్రంప్ ను మద్దతిస్తూనే ఉంటానని బార్టెల్ అంటున్నారు.