మద్యం ఏ రూపంలో ఉన్నా ఆరోగ్యానికి హానికరమేనని తాజా పరిశోధన స్పష్టత ఇచ్చింది. రెడ్ వైన్ ఆరోగ్యకరం అనే వాదనకు ఏ ఆధారాలు లభించలేదని అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. రెడ్ వైన్‌లోని రెస్ వెరట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ, అవి క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేశారు.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యున్‌యంగ్ చో మాట్లాడుతూ, గతంలో జరిపిన 42 పరిశోధనల్లో వెల్లడైన డేటాను విశ్లేషించిన తర్వాతే ఈ అంశాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు చాలా మంది రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని నమ్మినా, శాస్త్రీయంగా అలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
అదేవిధంగా, వైట్ వైన్ మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. వైట్ వైన్ తరచుగా తాగే మహిళల్లో చర్మ క్యాన్సర్ ముప్పు 22 శాతం పెరిగే అవకాశముందని వెల్లడించారు. అయితే, సూర్యకాంతికి గురికావడం వంటి ఇతర కారణాల వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఈ పరిశోధన ఫలితాలతో, రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న నమ్మకాన్ని శాస్త్రవేత్తలు తిరస్కరించారు. మద్యం ఆరోగ్యానికి హానికరమేనని, దీన్ని పూర్తిగా మానుకోవడం ఉత్తమమని పరిశోధకులు సూచించారు.