గ్లోబల్‌గా కోట్లాది మంది ఉపయోగించే వాట్సాప్ తాజాగా కొత్త దిశలో అడుగులు వేస్తోంది. తొలిసారిగా చెల్లింపు ఆధారిత సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రవేశపెట్టింది. భారత్‌లోని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సేవను ‘వాట్సాప్ ప్లస్’ (WhatsApp Plus) పేరుతో ప్రవేశపెట్టారు.
ఈ సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.79గా నిర్ణయించారు. కొత్త వినియోగదారులకు మొదటి నెల ఉచితంగా ట్రయల్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అయితే మెసేజింగ్, కాల్స్, స్టేటస్ అప్‌డేట్స్ వంటి ప్రాథమిక ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఇవన్నీ యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయి. వాట్సాప్ ప్లస్ ప్రధానంగా యాప్ లుక్ మరియు యూజర్ అనుభవాన్ని వ్యక్తిగతంగా మార్చుకోవాలనుకునే వారికి రూపొందించారు.
ఇందులో 18 కొత్త కలర్ థీమ్‌లు అందుబాటులో ఉండటంతో యాప్ రూపాన్ని వినియోగదారులు తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలాగే 14 కొత్త యాప్ ఐకాన్ డిజైన్‌లు, ప్రత్యేక రింగ్‌టోన్‌లు, కొత్త స్టిక్కర్ ప్యాక్‌లు వంటి అదనపు ఫీచర్లు కూడా అందిస్తున్నారు. చాట్ మేనేజ్‌మెంట్‌లో కూడా మార్పులు చేస్తూ ఒకేసారి 20 చాట్‌ల వరకు పిన్ చేసుకునే సదుపాయం ఇచ్చారు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి వాట్సాప్ యాప్‌లోని ‘సబ్‌స్క్రిప్షన్స్’ విభాగంలోకి వెళ్లి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ దశలవారీగా విడుదల అవుతోంది కాబట్టి అందరికీ వెంటనే కనిపించకపోవచ్చు. సాధారణ మెసేజింగ్ కోసం మాత్రమే వాట్సాప్ ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అవసరం లేకపోయినా, యాప్‌ను కొత్తగా డిజైన్ చేసుకుని వ్యక్తిగత అనుభవం కోరుకునే వారికి ఇది కొత్త ఎంపికగా మారనుంది.








