Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సీఈవో రాజేశ్ మీనన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోహ్లీ ఇంకా చాలా సంవత్సరాలు ఐపీఎల్‌లో ఆడతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భంగా రాజేశ్ మీనన్, కోహ్లీ ఫిట్‌నెస్ మరియు ఆటపట్ల అతని అంకితభావం ఇప్పటికీ తగ్గలేదని స్పష్టం చేశారు. రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అతడు తప్పకుండా ఆర్‌సీబీ తరఫున కొనసాగుతాడని ఆయన అభిప్రాయపడ్డారు.
కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఇప్పట్లో ఆలోచన లేదని, అతని ఎనర్జీ, పోటీ తత్వం, పరుగుల దాహం ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాయని సీఈవో తెలిపారు. ఆటగాడిగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ ఆర్‌సీబీతో అనుబంధాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం 675 పరుగులు చేసి టోర్నీలో నాలుగో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు, తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమమైన 165.84 స్ట్రైక్ రేటును నమోదు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులు చేసి ఆర్‌సీబీ విజయానికి కీలకంగా మారాడు.
2008 నుంచి ఆర్‌సీబీకి ప్రధాన బలం గా నిలుస్తున్న కోహ్లీ, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా (9,336 పరుగులు) రికార్డు సృష్టించాడు. అలాగే అత్యధిక సెంచరీలు (8) చేసిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు చేసి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా కోహ్లీ భారత జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచి అనేక రికార్డులు నెలకొల్పాడు. అతని స్థిరమైన ప్రదర్శన, ఫిట్‌నెస్ ప్రమాణాలు, నాయకత్వ లక్షణాలు భారత క్రికెట్‌పై పెద్ద ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ సీఈవో వ్యాఖ్యలు కోహ్లీపై ఫ్రాంచైజీకి ఉన్న విశ్వాసాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి.








