Amaravati: ప్రధాని మోడీ తన పాలనలో మరో ముఖ్యమైన విజయాన్ని సాధించారు. తన 4,399 రోజుల పాలనతో కొత్త రికార్డు నెలకొల్పిన నేపథ్యంలో, కేంద్ర మంత్రులు ఆయనకు నిలబడి చప్పట్లతో గౌరవ వందనం చేశారు. ఈ ప్రత్యేక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు కేంద్రం మరోసారి సానుకూలంగా స్పందించింది. మొదటి ప్రాజెక్ట్‌గా 5.35 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,299 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం లభించింది. స్మార్ట్ సిటీ నమూనాలో రూపొందించనున్న ఈ కాంప్లెక్స్ ద్వారా కేంద్ర కార్యాలయాల సమన్వయం, పరిపాలనా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.
రెండవ ప్రాజెక్ట్‌గా 17 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,235 కోట్ల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల కోసం గృహ సముదాయం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నివాస సముదాయం అమరావతిలో కేంద్ర ఉద్యోగులకు మెరుగైన వసతులు కల్పించనుంది. ఇప్పటికే అమరావతి అభివృద్ధికి కేంద్రం వివిధ మార్గాల్లో సహకారం అందిస్తోంది. ప్రపంచ బ్యాంకు ద్వారా భారీ రుణ సహాయానికి మద్దతు ఇవ్వడం, రైల్వే, జాతీయ రహదారులు, పోలవరం వంటి ప్రాజెక్టుల్లో ప్రాధాన్యత ఇవ్వడం తెలిసిందే.
తాజా నిర్ణయాలతో అమరావతి అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయని అధికారులు భావిస్తున్నారు. సీఆర్డీఏ ఇప్పటికే కేంద్ర సచివాలయం, నివాస సముదాయం కోసం భూమిని కేటాయించిన నేపథ్యంలో తాజా ఆమోదాలు అమరావతి రాజధాని నిర్మాణానికి కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ALSO READ: 2027 World Cup | టీమిండియాను వెంటాడుతున్న గాయాలు… కోహ్లీ, పాండ్యా అవుట్








