Vangalapudi Anitha: హోంమంత్రి పేరుతో వస్తున్న అనధికార పోస్టులపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు చెందిన అధికారిక ‘ఎక్స్’ (X) సామాజిక మాధ్యమ ఖాతా హ్యాక్‌కు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రజలు, మీడియా సంస్థలు, హోంమంత్రి ఫాలోవర్లకు కీలక సూచనలు జారీ చేశారు.
ప్రస్తుతం ఆ ఖాతా నుంచి వస్తున్న కొన్ని పోస్టులు హ్యాకర్ల ద్వారా అనధికారికంగా ప్రచారం అవుతున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. హోంమంత్రి పేరుతో కనిపించే ఆ పోస్టులను అధికారిక ప్రకటనలుగా భావించవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఖాతా నుంచి వచ్చే సందేశాలు, పోస్టుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హోంమంత్రికి సంబంధించిన నిజమైన సమాచారం ప్రభుత్వ అధికారిక వేదికల ద్వారానే విడుదల అవుతుందని తెలిపారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తులను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల సహకారంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదే సమయంలో హ్యాక్‌కు గురైన ‘ఎక్స్’ ఖాతాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రికవరీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. అధికారిక సమాచారం వచ్చే వరకు హోంమంత్రి ఖాతా నుంచి వచ్చే ఎలాంటి పోస్టులను షేర్ చేయడం లేదా వాటిని నమ్మడం చేయవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








