Telangana weather: తెలంగాణలో మరోసారి వర్షాల అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
అలాగే వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కూడా జల్లులు పడే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జూలై 26 నుంచి 31 వరకు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేశారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ, సాధారణ వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఇంకా లోటు నమోదవుతోంది. ఋతుపవనాలు చురుకుగా ఉన్నా, ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. నీటి వినియోగంలో పొదుపు పాటించాలని, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వర్షాధార పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించింది.
ALSO READ: Dharmendra Pradhan | “విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదు”.. రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు








