Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు ఈ పథకం ద్వారా ప్రతి ఉదయం పౌష్టిక విలువలు కలిగిన బ్రేక్ఫాస్ట్ అందించబడుతుంది.
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి రుచికరమైన, పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి, వారి శారీరక, మానసిక వికాసానికి బలమైన పునాది వేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.
అదే సమయంలో అంగన్వాడీ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచేందుకు, పర్యవేక్షణను సులభతరం చేయడానికి సీఎం అంగన్వాడీ వర్కర్లకు మొబైల్ ఫోన్లను కూడా పంపిణీ చేశారు.
ఇకపై అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కాకుండా, సొంత భవనాల్లో కొనసాగేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి విద్య, నీటిపారుదల ఎంత ముఖ్యమో, భవిష్యత్ తరాల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అన్నారు. గర్భధారణ దశ నుంచే తల్లికి సరైన పోషకాహారం అందితేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఆరేళ్లలోపు పిల్లలకు సరైన పోషకాహారం అందకపోతే, అది వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని సీఎం స్పష్టం చేశారు. ‘తొలి ముద్ద’ పథకం తెలంగాణలో పోషకాహార భద్రతకు కొత్త దిశ చూపుతూ, దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది.








