Electric Two Wheeler Subsidy: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ టూ వీలర్లపై అందిస్తున్న సబ్సిడీ గడువును ఈ ఏడాది జులై 31 వరకు పొడిగించింది.
అలాగే ఇ-రిక్షా, ఇ-కార్ట్ వాహనాలకు సంబంధించిన రాయితీలను 2028 మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్కు మరింత ఊతమివ్వనుంది.
పీఎం ఇ-డ్రైవ్ పథకాన్ని 2024 అక్టోబర్ 1న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఇ-అంబులెన్సులు, ఇ-ట్రక్కుల కొనుగోలుపై కేంద్రం రాయితీలు అందిస్తోంది. ప్రారంభంలో 1.4 మిలియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల విక్రయ లక్ష్యాన్ని నిర్ణయించినప్పటికీ, ఇప్పటివరకు 2.48 మిలియన్ వాహనాలు అమ్ముడవడం ఈ రంగం వేగంగా విస్తరిస్తోందని సూచిస్తోంది.
ఈ సబ్సిడీ అమలుకు కేంద్రం మొత్తం రూ.1,772 కోట్లు కేటాయించగా, అందులో ఇప్పటికే రూ.1,259.91 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఇ-రిక్షా, ఇ-కార్ట్ విభాగంలో 36,462 యూనిట్ల విక్రయ లక్ష్యం పెట్టినా, ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. దీంతో ఆ విభాగానికి కేటాయించిన నిధులను రూ.192 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించారు.
ఎలక్ట్రిక్ టూ వీలర్లలో సుమారు 10 లక్షల వాహనాలు విక్రయమవగా, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లలో లక్ష్యాన్ని మించి 1,62,981 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలో ఈవీ వినియోగం మరింత పెరగడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు, వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది.








